రోడ్డు లేక ప్రాణం విడిచిన రోగి..!

రోడ్లు సరిగ్గా లేక రోగి ప్రాణం విడిచాడు. ఈ ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజవర్గం గొల్లప్రోలు మండలం చిన్న జగ్గంపేటలో జరిగింది. చిన్న జగ్గం పేటకు చెందిన సత్యనారాయణ మంగళవారం అనారోగ్యానికి గురయ్యాడు. లేవలేని పరిస్థితి దీంతో… ఆంబులెన్స్ కు ఫోన్ చేశారు కుటుంబ సభ్యులు. ఆంబులెన్స్ సమయానికి అయితే వచ్చింది కానీ.. ఇంటి ముందు వరకు రాలేకపోయింది. దాదాపు 500మీటర్ల దూరంలో ఆంబులెన్స్ ఆగిపోయింది. హాస్పిటల్ కు రోగిని తరలించాలంటే అతన్ని ఆంబులెన్స్ వరకు తీసుకెళ్లక తప్పదు.

ఇక చేసేదేమిలేక కుటుంబ సభ్యులు సత్యనారాయణను బుజాల మీద దాదాపు అర కిలోమీటరు మోసుకుని వెళ్లారు. ఆంబులెన్స్ హాస్పిటల్ వైపు పరుగులు తీస్తుండగా.. రోగి ప్రాణం గాలిలో కలిసి పోయింది. డాక్టర్లు రోగిని పరిక్షించి హాస్పిటల్ కు తొందరగా తీసుకొచ్చినట్లయితే బ్రతికి ఉండే అవకాశం ఉండేదని తెలిపారు.

ఇంటి ముందు వరకు రోడ్డు లేకపోవడంతో ఆంబులెన్స్ అందుబాటులో లేకుండా పోయింది. అందుకు కారణం తెలుసుకుంటే ఆశ్చర్యం కలుగక మానదు.. చిన్న జగ్గపేటలోని కొన్ని ఏరియాలలో రోడ్లు విస్తరణ చేయకపోవడానికి కారణం స్థానికంగా ఉన్న కుల పంచాయితీలు, పార్టీ పంచాయితీలు అని సమాచారం. పలాన కుటుంబాలు ఓ పార్టీకి మద్దతుగా ఉండటంతో వారి వీధులకు రోడ్డు పనులు చేయలేదని స్థానికులు తెలిపారు. రాజకీయ కక్షలే ఇందుకు కారణమని.. ఇప్పటికైనా నాయకులు కళ్లుతెరవాలని ప్రజలు అభిప్రాయపడుతున్నారు.

మరిన్ని వార్తలకు ఇక్కడ క్లిక్ చేయండి

Spread the love