బృందావన్ కారిడార్ వద్దు… పీఎం మోడీ, సీఎం యోగీకి రక్తంతో లేఖలు…

వారణాసిలో ఏర్పాటు చేసిన విధంగా బృందావన్ లో కారిడార్ ను ఏర్పాటు చేయడాన్ని స్థానికులు వ్యతిరేకిస్తున్నారు. కారిడార్ ను ఏర్పాటు చేస్తే వ్యాపారాలు, ఇండ్లు దెబ్బతింటాయని అన్నారు. ఇందుకు నిరసనగా పీఎం మోడీకి, సీఎం యోగీకి రక్తంతో 108మంది లెటర్లు రాశారు. న్యాయస్థానానికి కూడా వెళ్లినట్లు తెలిపారు.

బృందావన్ లోని బాంకే బీహారీ ఆలయంలో గత ఏడాది జన్మాష్టమి వేడుకలలో తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఇద్దరు ప్రాణాలు కోల్పోగా ఆరుగురు గాయపడ్డారు. ఈ విషయంపై సీఎం యోగీ ఆదిత్యనాథ్ కమిటీని నియమించారు. ఆలయ పరిసరాలు ఇరుకుగా ఉండటం వలన భక్తుల మధ్య తొక్కిసలాట జరిగిందని తెలిపారు. దీంతో కారిడార్ ను ఏర్పాటు చేసేందుకు యోగీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. జనవరి 3న కారిడార్ నిర్మాణానికి సర్వే ప్రారంభించింది.

కారిడార్ ఏర్పాటును బృందావన్ వాసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కారిడార్ డిజైన్ కాపీలను దహనం చేశారు. ఆలయ పూజారులు, స్థానికులు, వ్యాపారులు కలిసి ధర్నా చేశారు. దీంతో మూడు రోజులుగా ఆలయ పరిసర వ్యాపార సముదాయాలు మూసివేయబడ్డాయి. బాంకే బీహారీ వ్యాపార సంఘం అధ్యక్షుడు అమిత్ గౌతమ్ మాట్లాడుతూ బృందావన్ వారసత్వాన్ని కాపాడాలని కోరుతూ ప్రధానికి, ముఖ్యమంత్రికి రక్తంతో రాసిన లేఖలను పంపామని తెలిపారు.

85ఏళ్ల నిరసనకారుడు శకుంతలా దేవి గోస్వామి మాట్లాడుతూ “కారిడార్ నిర్మాణం బృందావన్ వారసత్వాన్ని నాశనం చేయడమే కాకుండా మేము నిరాశ్రయులం అవుతాము” అని అన్నారు. స్థానికులు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. డిసెంబర్ 20, 2020న బాంకే బీహారీ ఆలయానికి సంబంధించిన రిట్ ఫిటీషన్ లో అంచనా వ్యయాలతో కూడిన అభివృద్ధి ప్రణాళికలను కమిటీ సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.

Spread the love